హైదరాబాద్: కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడానికి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ సర్పంచ్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన సాజిద్‌పాషా కుటుంబానికి మన్నెగూడ పంచాయతీ పరిధిలో వికారాబాద్ రోడ్డుపై 200 ఎకరాల భూమి ఉంది. రోడ్డుకు ఆనుకుని ఉన్న బిట్టులో.. వాణిజ్య సముదాయ నిర్మాణాన్ని ప్రారంభించారు. అదే సమయంలో పంచాయతీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. రూ. 20 లక్షలు ఇస్తేనే అనుమతి ఇస్తానంటూ సర్పంచ్ వినోద్‌గౌడ్ తేల్చి చెప్పాడు. దీంతో సాజిద్‌పాషా ఏసీబీని ఆశ్రయించారు. నగర శివార్లలో డబ్బు అందజేస్తానని సర్పంచ్‌కు కబురు పెట్టారు. హైదర్‌షాకోట్‌లోని ఆరెమైసమ్మ ఆలయం వద్దకు రప్పించారు. అక్కడ తన కారులో వినోద్‌గౌడ్‌కు రూ. 13 లక్షలు అందజేశారు. అప్పటికే అక్కడ వలపన్నిన ఏసీబీ అధికారులు.. వినోద్‌గౌడ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులను చూసిన పారిపోయేందుకు యత్నించాడు. దాంతో.. అధికారులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. తదుపరి కెమికల్ పరీక్షలో.. పాజిటివ్ రావడంతో, అరెస్టు చేశారు. అదే సమయంలో.. ఏసీబీకి చెందిన మరో బృందం మన్నెగూడ పంచాయతీ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. కాగా.. ఏసీబీ అరెస్టు చేసిన వినోద్‌గౌడ్ గతంలో ఉత్తమ సర్పంచ్ అవార్డును అందుకోవడం గమనార్హం..!
Mon Jan 19, 2015 06:51 pm