హైదరాబాద్: ఓ మహిళ ను ఇంట్లో నిర్బంధించి 15 రోజుల పాటు లైంగిక దాడి చేశాడు. శారీరకంగా హింసించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను రక్షించారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజమండ్రికి చెందిన ఓ మహిళకు కొద్ది కాలం క్రితం వివాహం అయింది. కుమార్తె పుట్టిన తర్వాత దంపతులు విడిపోయారు. కుమార్తెను పోషించేందుకు ఆమె ఇళ్లలో పని చేసేది. ఆమెకు తెలిసిన రవీందర్, ధనలక్ష్మి నగరానికి వస్తే పని ఇప్పిస్తామని చెప్పారు. రైలు టికెట్ కూడా పంపించారు. ఫిబ్రవరి 17న నగరానికి వచ్చిన ఆమె ఫిలింనగర్‌లో నివసించే సినీపరిశ్రమకు చెందిన వ్యాపారి ఉదయభాను వద్ద పనికి కుదిరింది. ఇంట్లో వంట, మిగతా పనులు చేయాలని చెప్పాడు. మరుసటి రోజు నుంచి మహిళపై దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. అదే రోజు ఆమెను తీవ్రంగా కొట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బయటకు వెళ్లే ముందు ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లేవాడు. ఇలా ప్రతి రోజూ హింసించడమే కాకుండా, లైంగికదాడి చేసేవాడు. బయటకు చెబితే ఆమె కుమార్తెను చంపేస్తానని బెదిరించేవాడు. ఫోన్ కూడా అందుబాటులో ఉంచేవాడు కాదు. 15 రోజులపాటు ఆమె చిత్రవధ అనుభవించింది. ఈ నెల 5వ తేదీన ఆమెకు అనుకోకుండా ఫోన్ దొరికింది. దాంతో జరిగిన విషయాన్ని కుమార్తెకు చెప్పింది. కుమార్తె ఇదే విషయాన్ని డయల్ 100కు ఫోన్ చేసి వివరించింది. స్పందించిన కంట్రోల్ రూం సిబ్బంది ముందుగా గోల్కొండ పోలీసులకు చెప్పారు. సంఘటన బంజారాహిల్స్ ఠాణా పరిధిలో జరగడంతో ఎస్‌ఐ రాంబాబు, వాసవి రంగంలోకి దిగారు. అపార్ట్‌మెంట్ వద్ద తాళం ఉండటంతో ఉదయభానుకు ఫోన్ చేశారు. పని చేయకపోవడంతో సికింద్రాబాద్‌లో ఉండే అతని బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి తాళం తీయగా, మహిళ ఇంట్లోనే ఉంది. బాధితురాలిని పోలీ్‌సస్టేషన్‌కు తరలించగా, లైంగికదాడి గురించి చెప్పింది. నిందితుడు గతంలోనూ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులు నమోదు అయ్యాయి.
Mon Jan 19, 2015 06:51 pm