చెన్నై: ప్రేమించి పెళ్లికి ముఖం చాటేసిన ప్రియుడి కారుపై పెట్రోల్ బాంబుతో దాడి చేసిందో యువతి. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా నెల్లూరులో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆమెతో పాటు మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నెల్లూరుకు చెందిన ప్రవీణ్ (38) అనే వ్యక్తి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని నెలల కిత్రం సెలవుపై సొంతూరుకు వచ్చాడు. తిరుచ్చెందూరు కాలేజీలో చదువుకునే రోజుల్లో జెస్సికా అనే యువతిని ప్రేమించాడు. ప్రవీణ్‌కు విదేశాల్లో ఉద్యోగం రావడంతో రెండేళ్లక్రితం వెళ్లిపోయాడు. తిరిగొచ్చి పెళ్లి చేసుకుంటానని జెస్సికాకు హామీ ఇచ్చాడు. ఇటీవల సొంతూరుకు వచ్చిన ప్రవీణ్ వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇది తెలుసుకున్న జెస్సికా... తనను రెండో పెళ్లయినా చేసుకోవాలని ప్రవీణ్‌ను కోరింది. దీనికి ప్రవీణ్ నిరాకరించాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి జెస్సికా.. మరో ఇద్దరితో కలిసి ప్రవీణ్ కారుపై పెట్రోల్ బాంబు విసిరి పారిపోయింది. ఈ ఘటనలో ప్రవీణ్ సురక్షితంగా బయటపడినా, కారు బుగ్గిపాలైంది. ప్రవీణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm