అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 22మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో రాంబాబు(50), సాక్ష(2) మృతిచెందినట్టు సమాచారం. క్షతగాత్రుల్లో 15 మందికి జంగారెడ్డిగూడెంలో ప్రాథమిక చికిత్స చేసి ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ తరలించారు. మిగిలిన ఐదుగురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. బాధితులంతా కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామానికి చెందినవారు. వీరంతా వ్యవసాయ కూలీలు. ఆదివారం గుబ్బలమంగమ్మతల్లి గుడికి మూడు ట్రాక్టర్లపై బయలుదేరారు. ఈ క్రమంలోనే జంగారెడ్డిగూడెం బైపాస్ రోడ్డు శ్రీనివాసపురం కూడలి దగ్గర చేరుకోగానే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో రాజమండ్రి వైపు నుంచి ఖమ్మం వెళ్తున్న లారీ అప్పుడే రోడ్డుపైకి వస్తున్న వీరి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇంజన్ ట్రక్కు నుంచి విడిపోయి 100 గజాల దూరంలో పడింది. ట్రక్కులో ఉన్న యాత్రికులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. సంఘటనాస్థలానికి చేరుకున్న డీఎస్పీ రవికిరణ్, ఆర్డీవో ప్రసన్నలక్ష్మీ పరిస్థితులను సమీక్షించి సహాయక చర్యలు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm