హైదరాబాద్ : కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జర్కిహొళి సెక్స్ కుంభకోణం కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఫిర్యాదుదారు సామాజిక కార్యకర్త దినేశ్ కలహళి తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. బాధితురాలి పరువు, ప్రతిష్ఠలకు భంగం కలుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు దినేశ్ ఓ లేఖను తన న్యాయవాది ద్వారా కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌కు పంపించారు. దినేశ్ కలహళి తరపు న్యాయవాది కుమార్ పాటిల్ మాట్లాడుతూ, తాను కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పోలీసు అధికారిని కలిసి, దినేశ్ పంపిన లేఖను సమర్పించానని తెలిపారు. జర్కిహొళిపై దినేశ్ చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపానని చెప్పారు. జర్కిహొళి ఓ మహిళతో అసభ్యకర రీతిలో ఉన్నట్లు చూపుతున్న సీడీని దినేశ్ మంగళవారం మీడియాకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో జర్కిహొళి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన బీఎస్ యడియూరప్ప మంత్రివర్గంలో జల వనరుల శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు.
Mon Jan 19, 2015 06:51 pm