హైదరాబాద్: మధ్య ఆఫ్రికా దేశం ఈక్వటోరియల్ గినియాలోని సైనిక కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో 20 మంది వరకు మృతిచెందగా, సుమారు 500 మంది గాయపడ్డారు. దేశంలోనే అతిపెద్ద పట్టణం, ఆర్థిక రాజధాని అయిన బాటాలోని కోవా టోమా సైనిక స్థావరంలో భారీ పేలుడు సంభవించింది. మొత్తం నాలుగుసార్లు పేలుళ్లు సంభవించాయని స్థానిక మీడియా పేర్కొంది. ఈ పేలుళ్ల ధాటికి సైనిక స్థావరం పరిసరాల్లో ఉన్న ఇండ్లు, ఇతర నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. ఒక్కసారిగా సంభవించిన ఈ ప్రమాదంతో సైనికులతోపాటు, ప్రజలు పెద్దసంఖ్యలో గాయపడ్డారు. సైనికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానలకు తరలించారు. బాధితులు భారీగా ఉండటంతో అక్కడి హాస్పిటళ్లు వారితో కిక్కిరిసిపోయాయి. మందుగుండు సామాగ్రి, డైనమైట్లు, పేలుడు పదార్థాలను నిల్వ ఉంచే విషయంలో సైనికుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని దేశ అధ్యక్షుడు టియోడోరో ఒబియాంగ్ అన్నారు. గాయపడినవారికి ప్రజలు రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. చమురు, సహజవాయు నిక్షేపాలు అధికంగా ఉండే ఈ మధ్య ఆఫ్రికా దేశంలో బాటా అతిపెద్ద నగరం. దేశంలో మొత్తం 1.4 మిలియన్ల జనాభా ఉండగా, ఒక్క బాటాలోనే 8 లక్షల మందికిపైగా నివసిస్తున్నారు. అందులో పేదరికంలో మగ్గుతున్నవారే అధికంగా ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm