హైదరాబాద్ : భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరిట, దేశవ్యాప్తంగా జరుపనున్న ఉత్సవాలను, తెలంగాణలో ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నాటి భారత స్వాతంత్ర్య సంగ్రామం జరుగుతున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతం పోషించిన పాత్ర ప్రత్యేకమైనదని సిఎం అన్నారు. ప్రస్థుతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా స్వయం పాలనలో అభివృద్ది పథంలో దూసుకు పోతున్నదని, దేశ అభ్యుదయంలో తెలంగాణది ఉజ్వలమైన భాగస్వామ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. 12 మార్చి 2021 నుండి 2022 ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు నిర్వహించనున్న ఈ మహోత్సవాలకు రూ. 25 కోట్లు కేటాయిస్తున్నట్టు సిఎం తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ సలహాదారు కె.వి . రమణాచారి వ్యవహరిస్తారని సిఎం చెప్పారు. ఈమేరకు ఉత్తర్వులు జారీచేయాలని సిఎస్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm