ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలు గందరగోళంగా మారాయి. పరిషత్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు ఎక్కువయ్యాయి. దాదాపు ప్రతి జిల్లాలో ఘర్షణలు తలెత్తుతున్నాయి. అసలు ఈ ఎన్నికలే బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు ఇచ్చినా.. దాదాపు అన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు
ఈ ఎన్నికల పోటీల్లో ఉన్నారు. అయితే చాలాచోట్ల ఉదయం నుంచి వైసీపీ-టీడీపీ నేతల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
గోనెపూడిలో టీడీపీ శ్రేణుల ఆందోళనకు దిగారు. నరసరావుపేట మండలంలోని పోలింగ్ కేంద్రాల దగ్గరకు వెళ్లకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. పోలింగ్ కేంద్రం దగ్గర బైఠాయించి టీడీపీ నేతలు నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లాలో బ్యాలెట్ బాక్సును నీళ్లలో వేశాడు ఓ బీజేపీ ఏజెంట్. దీంతో పొనుగోడులో కాసేపు ఎన్నికలను నిలిపివేశారు. అయితే అడ్డుకునేందుకు అక్కడి సిబ్బంది ప్రయత్నించినా వారిన నెట్టుకుంటూ వెళ్లి బ్యాలెట్ బాక్సును నీళ్లలో పడేశాడు. ఇక విశాఖపట్నంలో ఓ అభ్యర్థి గుర్తు మారిందని ఆందోళనకు దిగాడు. సీతగుంటలో అభ్యర్థి గుర్తు మారిందని ఆలస్యంగా గుర్తించాడు. దీంతో ఆ బ్యాలెట్ పేపర్ పట్టుకుని అక్కడే బైఠాయించి నిరసన తెలిపాడు. సీపీఐ తరపున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తికి కంకి కొడవలికి బదులుగా సుత్తి కొడవలి వచ్చింది. దీంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉందని నిరసన తెలిపాడు.
విజయనగరం జిల్లాలో వైసీపీ, టీడీపీ కార్యకర్థల మధ్య ఘర్షణ నెలకొంది. ద్వారపూడి పోలింగ్ కేంద్రం ఇరు వర్గాలు బాహాబాహికి దిగాయి. ఓటరు స్లిప్పుల పంపిణీ విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఇరువర్గాల మధ్య తోపులాటకు దారి తీసింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు సర్ధి చెప్పే ప్రయత్నం చేసినా ఎవరూ వెనక్కు తగ్గలేదు. దీంతో పోలీసులు వారిని చెదరొట్టాల్సి వచ్చింది. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం పోతలపాడులో ఏజెంట్ల మధ్య వివాదం తో పోలింగ్ కు అంతరాయం ఏర్పాడింది. మరోవైపు కొయ్యలగూడెం మండలం అంకాలగూడెంలో వైసీపీ వర్గీయులు దాడిలో టీడీపీ అభ్యర్థి ఏకుల గడ్డియ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతడు కొయ్యలగూడెం ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కడప జిల్లా రాజోలు పోలింగ్ కేంద్రంలో టీడీపీ అభ్యర్థి రాజేశ్వర్ బ్యాలెట్ పేపరు బయటకు తెచ్చారంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రేగాటిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన నాయకుడు మధుసూదన్ రెడ్డి ఇంటిపై వైసీపీ వర్గీయులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో మధుసూదన్ రెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. చిత్తూరు జిల్లా ఉప్పతివారిపల్లెలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి భీరం శిరీష నిరసనకు దిగారు. టీడీపీ ఏజెంట్లను బయటకు పంపారంటూ ఆందోళనకు దిగారు. ప్రకాశం జిల్లా చెరుకూరు తాత్కాలికంగా ఎంపీటీసీ ఎన్నికను నిలిపేశారు. ఎంపీటీసీ-1 బ్యాలెట్ పత్రాలను వేరే కేంద్రానికి వెళ్లడంతో గందరగోళం ఏర్పడింది. మరోవైపు చిత్తూరు జిల్లాలోని చాలా గ్రామాల్లో ఎన్నికలను స్వచ్ఛందంగా బహిష్కరించారు. రామకుప్పం మండలం రామాపురం తాండా పరిషత్ ఎన్నికల్లో పాల్గొనేందుకు తాండా వాసులు ఆసక్తి చూపించలేదు. తమ గ్రామాన్ని పంచాయతీ కేంద్రంగా చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం తాలాడ కేంద్రాల్లోనూ పోలింగ్ ఆలస్యమైంది. ఓటరు జాబితాకు ఓటరుకు ఇచ్చిన సిప్పులకు మధ్య చాలా వ్యత్యాసం ఉండడంతో ఏజెంట్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో తాత్కాలికంగా పోలింగ్ ను అధికారులు నిలిపివేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 08 Apr,2021 02:40PM