హైదరాబాద్ : హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన స్వరూప్ గోపాల్ దాస్ (37) తన భార్య దీప (30), ఇద్దరు పిల్లలు టిట్టీ దాస్ (5), ఐదు నెలల కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాల్ దాస్ జనరల్ బజార్‌లో స్వర్ణకారుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం విమల్ అనే వ్యక్తి తాను ఇచ్చిన నగల కోసం గోపాల్‌కు ఫోన్ చేయగా మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తున్నట్టు చెప్పాడు. ఆ సమయానికి షాప్‌కు వచ్చిన విమల్.. సాయంత్రం వరకు వేచి చూసినా గోపాల్ రాకపోవడంతో ఇంటికి వెళ్లాడు. లోపల గడియపెట్టి ఉండడంతో వెళ్లిపోయిన విమల్ కాసేపటి తర్వాత మరోమారు వచ్చాడు. ఇంట్లోంచి పెద్ద శబ్దంతో టీవీ మోగుతుండడం, ఎంత పిలిచినా లోపలి నుంచి ఎవరూ స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన ఆయన రాత్రి 8 గంటల సమయంలో మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గోపాల్ ఇంటికి వచ్చిన పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా కుటుంబం మొత్తం విగతజీవులుగా పడి ఉన్నారు. నలుగురి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. బాధిత కుటుంబానికి చెందిన వారు ఎవరూ లేకపోవడంతో ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సైనెడ్ మింగి ఆత్మహత్యకు పాల్పడినట్టు అంచనా వేశారు. ఆర్థిక సమస్యలే గోపాల్ దాస్ కుటుంబం ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
Mar 17,2018 09:03AM-7