ముంబై : ముంబైలో సబర్బన్ రైల్వే సర్వీసులు మళ్లీ మొదలయ్యాయి. రైల్వే ఉద్యోగాల కోసం నియామకాలు చేయాలంటూ విద్యార్థులు ఇవాళ రైల్వే ట్రాక్‌పై ధర్నా నిర్వహించారు. దీంతో ఉదయం రష్ అవర్‌లో సబర్బన్ రైళ్లు చాలా వరకు నిలిచిపోయాయి. సుమారు 60 సబర్బన్ రైళ్లు ఆగిపోయినట్లు సమాచారం. అయితే ఉదయం 11 గంటల సమయంలో ఆందోళన విరమిస్తున్నట్లు విద్యార్థులు ప్రకటించారు. దీంతో మతుంగ-ఛత్రపతి శివాజీ టర్మినల్ మధ్య తిరిగి సబర్బన్ రైళ్ల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. తమ డిమాండ్లు వినేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో విద్యార్థులు నిరసన విరమించారు. ముంబైకి చెందిన బీజేపీ ఎంపీ కీర్తి సోమ్య విద్యార్థులకు హామీ ఇచ్చారు. రైల్వే అప్రెంటిషిప్ చేసిన ఉద్యోగులుకు 20 శాతం కోటా ఉంటుంది. దాని కోసం అప్రెంటిషిప్ పూర్తి చేసిన వాళ్లు ప్రత్యేకంగా వ్రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది. అయితే ఆందోళన చేస్తున్న విద్యార్థుల ఆ నియమాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం కోటాను విద్యార్థులకే కేటాయించాలని ఆందోళన చేపట్టారు. ఆందోళన విరమించినా.. విద్యార్థులు మాత్రం ఇంకా రైల్వే ట్రాక్ పరిసరాల్లోనే ఉన్నారు.
Mar 20,2018 11:03AM-7