న్యూఢిల్లీ : ఇరాక్‌లోని మోసుల్‌లో చనిపోయిన 39 మంది భారతీయుల గురించి ముందుగా పార్లమెంట్‌లో చెప్పడాన్ని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సమర్థించుకున్నారు. ఆ బంధీ మృతుల గురించి పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాతనే ఈ సమాచారాన్ని వెల్లడించినట్లు ఆమె చెప్పారు. పార్లమెంట్ కంటే ముందు మాకెందుకు చెప్పలేదని కొందరు బాధితులు ప్రశ్నిస్తున్నారు, కానీ పార్లమెంటరీ వ్యవస్థలో ముందు ఆ విషయాన్ని సభలో చెప్పాలని, ఆ బాధ్యతతోనే ముందుగా ఆ బంధీలు చనిపోయారన్న అంశాన్ని పార్లమెంట్‌లో వెల్లడించినట్లు సుష్మా తెలిపారు. ఇవాళ రాజ్యసభలో మోసుల్ మృతుల పట్ల కేంద్ర మంత్రి సుష్మా ప్రకటన చేశారు. దీంతో ఆ అంశం వివాదాస్పదమైంది. 39 మంది కుటుంబసభ్యులకు మరణవార్తను వెల్లడించకుండానే పార్లమెంట్‌లో ఎలా చెబుతారని ప్రశ్నలు వెల్లువతాయి. అయితే రాజ్యసభలో తాను చేసిన ప్రకటనను సుష్మా సమర్థించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వల్ల లోక్‌సభలో నివాళి అర్పించలేకపోయామన్నారు. మృతుల గురించి ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపిన తర్వాతనే ఈ విషయాన్ని రూఢీ చేశామన్నారు. బంధీల ఆధారాల కోసం వాళ్లను అడిగినట్లు కూడా ఆమె గుర్తు చేశారు. 38 మంది మృతుల డీఎన్‌ఏ శ్యాంపిళ్లు మ్యాచ్ అయ్యాయని, మరో బాధితుడి వెరిఫికేషన్ జరుగుతోందన్నారు. భారతీయ బంధీలు బ్రతికున్నారన్న విషయంలో ఇన్నాళ్లూ తమకు స్పష్టమైన సమాచారం లేదన్నారు. 2014, 2017లోనూ అదే జరిగిందన్నారు. మేం ఎవరికీ తప్పుడు సంకేతాలివ్వలేదన్నారు. మృతిచెందిన వారిలో 27 మంది పంజాబ్, 6 బిహార్, 4 హిమాచల్ ప్రదేశ్, ఇద్దరు పశ్చిమ బెంగాల్‌కు చెందినవారున్నారు. ఇస్లామిక్ చెర నుంచి తప్పించుకుని వచ్చిన హర్జిత్ మాషిని ఎవరూ వేధించలేదని సుష్మా తెలిపారు.
Mar 20,2018 05:03PM-1