హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) రెండో విడత సీట్లను మంగళవారం కేటాయించారు. 44 డిగ్రీ కాలేజీల్లో సున్నా ప్రవేశాలున్నాయి. ఈ మేరకు మంగళవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డి, దోస్త్ కన్వీనర్ ఆర్ లింబాద్రి మాట్లాడుతూ 188 కాలేజీల్లో 25 కంటే తక్కువ ప్రవేశాలున్నాయని చెప్పారు. 366 కాలేజీల్లో 50 కంటే తక్కువ ప్రవేశాలున్నాయని అన్నారు. 584 కాలేజీల్లో 100 కంటే తక్కువ ప్రవేశాలున్నాయని వివరించారు. దోస్త్ రెండో విడతలో 70,925 మందికి సీట్లు కేటాయించామని చెప్పారు. మొదటి విడతలో 80,678 మంది చేరారని అన్నారు. మొదటి, రెండో విడత కలిపి 1,51,603 మందికి సీట్లు కేటాయించామని చెప్పారు. ఇందులో ప్రభుత్వ కాలేజీల్లో 36,491 మందికి, ఎయిడెడ్‌లో 9,002 మందికి, యూనివర్సిటీ కాలేజీల్లో 3,413 మందికి, ప్రయివేటులో 1,01,571 మందికి, ప్రయివేటు అటానమస్ కాలేజీల్లో 995 మందికి, రైల్వే డిగ్రీ కాలేజీలో 131 మందికి సీట్లు కేటాయించామని వివరించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మొదటి ప్రాధాన్యం ఇచ్చి సీట్లు పొందిన విద్యార్థులకూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టం ఆధారంగా వెబ్‌సైట్‌లో నమోదు చేసేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు. తప్పనిసరిగా కేటాయించిన కాలేజీలో చేరాలన్న నిబంధనను సడలిస్తామని చెప్పారు. రెండో విడతలో సీట్లు కేటాయించిన విద్యార్థులు ఈనెల 25వ తేదీ వరకు కాలేజీల్లో చేరేందుకు అవకాశముందని అన్నారు.
Jun 20,2018 11:06AM-1