హైదరాబాద్: ప్రపంచంలోని సురక్షిత నగరాల్లో హైదరాబాద్ ఒకటని నగర సీపీ అంజనీకుమార్ అన్నారు. రవీంద్రభారతిలో జరిగిన షీ టీమ్స్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్‌ను మరింత సురక్షితంగా మార్చాల్సిన బాధ్యత అందరిదన్నారు. మహిళల భద్రత చాలా ముఖ్యమని, ప్రతి మహిళ ఒక ఆదర్శప్రాయురాలన్నారు. ఎవరైనా నేరం చేయడం తప్పు అని, నేరాన్ని చూస్తూ ఊరుకోవడం కూడా పెద్ద తప్పు అన్నారు. డయల్ 100 నంబర్ మీకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. డయల్ 100 నంబర్‌కు రోజుకు 5వేల కాల్స్ వస్తున్నాయని, కాల్ చేసిన 5 నిమిషాల్లో పోలీసు వాహనం ఘటనా స్థలికి చేరుకుంటుందన్నారు. నగరంలోని 65 పీఎస్‌లలో రోజుకు 15 వరకు ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. స్టేషన్ల వారీగా పని తీరును పరిశీలిస్తున్నామన్నారు. స్నేహపూరిత పోలీసింగ్ దిశగా ముందుకు వెళ్తున్నామని, సమాజాభివృద్ధి, నేర నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఆపదలో ఉన్న మహిళలు హాక్ ఐ అప్లికేషన్ ద్వారా తక్షణ సాయం పొందవచ్చునని పేర్కొన్నారు.
Jun 21,2018 03:06PM-6