న్యూఢిల్లీ: నిర్లక్ష్యంగానో, వేగంగానో వాహనాన్ని నడిపి ప్రమాదానికి గురైతే బీమా వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ రకంగా ప్రమాదానికి గురైన వారు ఇన్స్యూరెన్స్ కు క్లెయిమ్ చేసుకోవద్దని తెలిపింది. అయితే, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి మాత్రం 'పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ' కింద పరిహారం అందుతుందని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అబ్దుల్ నజీర్ లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.
దిలీప్ భౌమిక్ అనే వ్యక్తి 2012 మే 20న రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులు బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, స్వయం తప్పిదం వల్లే ఆయన ప్రమాదానికి గురయ్యాడని బీమా కంపెనీ వాదించింది. మృతుడి కుటుంబసభ్యులకు రూ. 10.57 లక్షల బీమా చెల్లించాలని త్రిపుర హైకోర్టు ఆదేశించింది. దీంతో సదరు కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు... హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తోసి పుచ్చింది.
మృతుడు నిర్లక్ష్యంతో వాహనం నడిపారని... స్వయం తప్పిదం కారణంగా ప్రమాదం జరిగితే బీమా చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీం తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 166 ప్రకారం బాధిత కుటుంబసభ్యులు కూడా బీమా కోరవద్దని చెప్పింది. ఇదే సమయంలో పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కింద భౌమిక్ కుటుంబానికి రూ. 2 లక్షల బీమా ఇవ్వాలని ఆదేశించింది.
Sep 04,2018 05:09PM-6