Sep 23,2018 03:09PM-6
అమరావతి: అరకు టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపడంపై ఆయన కుమారుడు నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే ఢిల్లీ నుంచి విశాఖకు ఆయన బయలుదేరారు. అంతకుముందు, మీడియాతో ఆయన మాట్లాడుతూ, మావోయిస్టుల నుంచి తమకు ఎప్పుడూ హెచ్చరికలు రాలేదని, తన తండ్రి కూడా ఎప్పుడూ ఈ ప్రస్తావన తేలేదని, వారు తన తండ్రిని ఎందుకు చంపారో తెలియదని అన్నారు.
అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపడాన్ని ఖండిస్తున్నానని జనజాగృతి పార్టీ అధినేత, ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. సర్వేశ్వరరావు మృతి వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, మావోయిస్టులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రాజకీయ విభేదాలున్నా కూడా సర్వేశ్వరరావు చాలా సన్నిహితంగా మెలిగేవారని గుర్తుచేసుకున్నారు.