నవతెలంగాణ-కమ్మర్‌పల్లి: ప్రణయ్ హత్య విషయంలో ఓ పోస్టు షేర్ చేయడాన్ని తప్పు బడుతూ రెండు దళిత కుటుంబాలపై వీడీసీ దౌర్జన్యానికి దిగింది. బహిష్కరించినట్టు చెప్పకుండానే సదరు దళిత కుటుంబాలకు సహాయ, సహకారాలు అందించవద్దని గ్రామస్తులకు హుకుం జారీ చేసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌లో మంగళవారం జరిగింది. బాధితుని వివరాల ప్రకారం.. ఉప్లూర్ గ్రామానికి చెందిన సుంకరి విజరుకుమార్ ఇటీవల జరిగిన ప్రణరు హత్యపై ఫేస్‌బుక్‌లో ఓ పోస్టును ఈ నెల 18న షేర్ చేశాడు. ఈ పోస్టుపై మండల కేంద్రానికి చెందిన కైరి దశాగౌడ్ తప్పు పడుతూ కామెంట్ చేశాడు. ఈ విషయంలో వీరిద్దరి మధ్య ఫేస్‌బుక్‌లో వివాదం జరిగింది. విజరుకుమార్ పోస్టుకు వ్యతిరేకంగా ఈ నెల 19న మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై కైరి దశాగౌడ్, పలువురు ధర్నా చేశారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని ఉప్లూర్ గ్రామాభివృద్ధి కమిటీ సుంకరి విజరుకుమార్, అతని ప్రోత్సహించిన నీరటి హరీష్ కుటుంబాలపై బహిష్కరణ వేటు వేసింది. వివక్ష రూపం బయటకు పొక్కకుండా చాటింపూ చేయకుండానే ఆ రెండు కుటుంబాలకు సహకరించొద్దని గ్రామస్తులకు హుకుం జారీచేసింది. ఎవరు మాట్లాడినా రూ.70వేల జరిమానా విధించేవిధంగా తీర్మానించి నట్టు సమాచారం. ఈ క్రమంలో తమను గ్రామంలో నీళ్లు పట్టనివ్వడం లేదని, హోటళ్లలో చాయి కూడా పోయడం లేదని, తమ పశువులను మందలోనికి రానివ్వడం లేదని బాధితుడు విజరుకుమార్ ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిపై ఎస్‌ఐ మురళికి విజరుకుమార్ ఫిర్యాదు చేశాడు. తనపై దాడి చేయడానికి పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారని, కులం పేరుతో అవహేళన చేస్తున్నారని ఎస్‌ఐకి వివరించాడు. చేసిన తప్పునకు గ్రామ నడిబొడ్డున నేలకు ముక్కు రాసి క్షమాపణ చెప్పాలని, వీడీసీ సభ్యులందరి కాళ్లు మొక్కాలని చెబుతున్నారని బాధితుడు వాపోయాడు. తమ కుటుంబాలకు ప్రాణహాని ఉందని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని ఎస్‌ఐ మురళిని కోరారు.
Sep 26,2018 10:09AM-1