న్యూఢిల్లీ: గంగా నది కార్యకర్త, ప్రముఖ పర్యావరణవేత్త జీడీ అగర్వాల్(87) కన్నుమూశారు. గంగా నది ప్రక్షాళన కోరుతూ అగర్వాల్ గడిచిన జూన్ 22వ తేదీ నుంచి నిరవదిక నిరాహార దీక్ష చేస్తున్నారు. గుండెపోటుతో ఆయన మృతిచెందారు. ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి, ఉత్తరకాశీల మధ్య గంగానది ప్రవాహానికి అంతరాయం కలుగకుండా చేయడంతో పాటు గంగా నది పరిరక్షణకు చట్టం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీక్షలో ఉండగా నీటిలో తేనె కలుపుకొని మాత్రమే సేవించేవారు. చర్చలు విఫలమవడంతో గత రెండు రోజులుగా ఆ నీరును కూడా తీసుకోవడం బంద్ చేశారు. దీంతో 109 రోజుల దీక్ష అనంతరం పోలీసులు అగర్వాల్‌ను నిన్న బలవంతంగా హరిద్వార్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో గుండెపోటుకు గురై మృతిచెందారు. 2009లో సైతం భగీరథి నదిపై డ్యాం నిర్మాణాన్ని బంద్ చేయాలని కోరుతూ దీక్షకు దిగారు. జీడీ అగర్వాల్ గతంలో ఐఐటీ కాన్పూర్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. అదేవిధంగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సెక్రటరీ మెంబర్‌గా పనిచేశారు.
Oct 11,2018 05:10PM-6