డబ్లిన్: ఐర్లాండ్‌లో మహిళా ఎంపీ రూత్ కాపింజర్.. తమ దేశ న్యాయవ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో ఆమె మహిళలు వేసుకునే అండర్‌వేర్‌ను ప్రదర్శిస్తూ తన కోపాన్ని ప్రదర్శించారు. ఇటీవల కార్క్ అనే పట్టణంలో ఓ 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి అత్యాచారానికి గురైంది. ఆ కేసులో 27 ఏళ్ల వ్యక్తిని నిర్ధోషిగా ప్రకటించారు. అయితే కోర్టులో ఆ కేసు విచారణ జరుగుతున్న సమయంలో.. లాయర్ మాట్లాడుతూ ఆ యువతి ఎలాంటి అండర్‌వేర్ వేసుకుందో తెలుసా అని ప్రశ్నించాడు. దీంతో దేశవ్యాప్తంగా న్యాయవాదుల తీరుపై నిరసన వెల్లువెత్తుతున్నది. విచారణ సమయంలో ఎలాంటి ప్రశ్నలు వేయాలో కూడా తెలియదా అని కొందరు నిలదీస్తున్నారు. ఎప్పుడూ బాధితులను తప్పుగా చిత్రీకరిస్తున్నారంటూ ఎంపీ కాపింజర్ ఆరోపించారు. బాధితులను వేధించడం నిలిపేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో ఆ ఎంపీ మాట్లాడుతూ.. బాధితురాలు వేసుకున్న అలాంటి అండర్‌వేర్‌నే ప్రదర్శించారు. ఈ కేసుకు సంబంధించిన తీర్పు కాపీ బయటకు రాగానే.. న్యాయవాదులు వేస్తున్న ప్రశ్నల సరళిపై దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది.
Nov 14,2018 08:11PM-1