ధర్మపురి : జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన సోమిశెట్టి రంజిత్ అనే యువకుడిపై ధర్మపురికే చెందిన కట్కం అమరేశ్వర్ అనే యువకుడు కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేసినట్లు ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు. రంజిత్ కొరియర్ సర్విస్ నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అతడి తమ్ముడు శివసాయి, ధర్మపురికే చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరుకుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. వారం క్రితం ప్రేమికులిద్దరూ ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వెళ్లి ప్రేమవివాహం చేసుకొని ఫొటోలను తల్లిదండ్రులకు పంపి, సోషల్‌మీడియాలోనూ అప్‌లోడ్ చేశారు. ఈ వ్యవహారంపై మండిపడ్డ యువతి సోదరుడు అమరేశ్వర్ తన సోదరి గురించి మాట్లాడేందుకు రంజిత్ వద్దకు వచ్చాడు. శివసాయి అడ్రస్ చెప్పాలనీ, ధర్మపురికి పిలిపించాలని గొడవకు దిగాడు. ఆ విషయం తనకు తెలియదని రంజిత్ తెలుపడంతో ఇద్దరి మధ్యకొంత వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో కోపోద్రిక్తుడైన అమరేశ్వర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో రంజిత్‌పై దాడిచేశాడు. ఎడమవైపు పొత్తికడుపులో, వీపు భాగాన, తొడపైన కత్తితో పొడిచి పరారయ్యాడు. గాయాల పాలైన రంజిత్ తీవ్ర రక్తస్రావంతో తన కొరియర్ కార్యాలయం నుంచి బయటకు వచ్చి రక్షించండని అరవడంతో స్థానికులు ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యుడు చికిత్స చేసి, పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ తరిలించాలని చెప్పడంతో బంధువులు తీసుకెళ్లారు. కాగా అమరేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నామనీ, రంజిత్ తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ శ్రీకాంత్ వివరించారు.
Nov 20,2018 10:11PM-1