భద్రాద్రి కొత్తగూడెం: అశ్వారావుపేట మండలం నారాయణపురం సమీపంలో సోమవారం సాయంత్రం ద్విచక్రవాహనం కల్వర్టును ఢీకొట్టిన ప్రమాదంలో మూడు నెలల చిన్నారి మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని వేలేరుపాడు మండలం చాగరపల్లికి చెందిన తెల్లం వెంకటేశ్- నాగలక్ష్మీ దంపతులు తమ మూడు నెలల బాలుడితో కలిసి రెండురోజుల క్రితం తన అత్తారిల్లు అయిన మండలంలోని గుంటిమడుగు గ్రామానికి వచ్చారు. గ్రామంలో బంధువుల ఇంట్లో దశదినకర్మకు హాజరై సోమవారం సాయంత్రం వరుసకు సోదరుడైన వర్సా శ్రీనుతో కలిసి ద్విచక్ర వాహనంపై చాగరపల్లి బయలుదేరారు. వీరి ద్విచక్ర వాహనం నారాయణపురం సమీపంలో అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. దీంతో వాహనం సహా అందరూ లోయలో పడిపోయారు. ఈ ప్రమాదంలో మూడునెలల బాలుడు అక్కడిక్కడే మృతిచెందాడు. మృతిచెందిన బాలుడికి ఎక్కడా గాయాలు కాలేదు. తెల్లం వెంకటేశ్ తలకు బలమైన గాయాలయ్యాయి. నాగలక్ష్మి, శ్రీనుకు పలుచోట్ల గాయాలయ్యాయి. క్షతగాత్రులను అశ్వారావుపేట సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు.
Feb 12,2019 07:02AM-9