Feb 12,2019 11:02AM-13
లక్నో : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైన ప్రియాంకగాంధీ లక్నో నగరంలో చేపట్టిన రోడ్ షో సందర్భంగా దొంగలు తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించారు. లక్నో విమానాశ్రయం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు రోడ్ షో నిర్వహించగా కొందరు దొంగలు తమ చోరకళను ప్రదర్శించారు. దీంతో రోడ్ షోలో పాల్గొన్న 50 మంది మొబైల్ ఫోన్లను దొంగలు తస్కరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఓ దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పార్టీ కార్యకర్తలే కాకుండా పార్టీ నాయకులు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి జీషాన్ హైదర్ ల ఫోన్లు చోరీ అయ్యాయి. యాభైమంది నుంచి ఫోన్లు పోయాయని ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు దొంగల కోసం దర్యాప్తు చేస్తున్నారు. చోరీ అయిన ఫోన్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు సైబర్ పోలీసులు ఆరా తీస్తున్నారు.