హైదరాబాద్ : కొత్త టారిఫ్ విధానం కింద ఛానళ్ల జాబితాను ఎంచుకునేందుకు ఇచ్చిన గడువును టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) మరోసారి పొడిగించింది. మార్చి 31, 2019 లోపు వినియోగదారులు తమకు కావాల్సిన ఛానళ్లను ఎంచుకోవచ్చని తెలిపింది. గతంలో ఆ గడువు జనవరి 31 వరకు ఉంది. దాన్ని ఇప్పుడు మరోసారి పొడిగించారు. ట్రాయ్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 100 మిలియన్ల కేబుల్ సర్వీసులు, 67మిలియన్ల డీటీహెచ్ సర్వీసులు ఉన్నాయి. ఛానళ్లను ఎంచుకోవడంలో కొందరు వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక కేబుల్ ఆపరేటర్లు ఛానళ్ల ఎంపిక విషయంలో వినియోగదారులకు అవగాహన కల్పించకపోవడంతో ఇటువంటి ఇబ్బంది తలెత్తుతుందని ట్రాయ్ వెల్లడించింది. ఛానళ్లు ఎంపిక చేసుకునేందుకు పాత ప్లాన్ కొనసాగుతోందని ట్రాయ్ తెలిపింది. బెస్ట్ ఫిట్ ప్లాన్ కింద వినియోగదారులు తమకు కావాల్సిన ఛానళ్లను ఎంపిక చేసుకోవడంలో ఎక్కువ మంది విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపికకు గడువును పొడిగించినట్లు ట్రాయ్ తెలిపింది.
Feb 12,2019 09:02PM-8