దర్భంగా : వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచిన సంఘటన బీహార్‌లో జరిగింది. ఒక బాలుడికి ఎడమ చేయి విరిగితే వైద్యులు కుడి చేతికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పిఒపి)తో కట్టు వేసి పంపించేశారు. డాక్టర్లు తనకు చికిత్స చేస్తున్న సమయంలో వారికి చెప్పడానికి ఎంతో ప్రయత్నించానని, కాని వాళ్లు వినలేదని ఏడేళ్ల బాలుడు ఫైజాన్ అన్నాడు. ఇది వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఫైజన్ తల్లి అన్నారు. దీనిపై సమగ్రంగా విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. తమకు ఆసుపత్రిలో ఒక టాబ్లెట్ కూడా ఇవ్వలేదని ఆమె అన్నారు. కాగా ఈ సంఘటనకు సంబందఙంచి రాష్ట్ర ఆరోగ్య శాఖకు, ఆరోగ్యమంత్రికి కూడా సమాచారం అందింది. ఈ ఘటనపై స్పందించిన మంత్రి మంగల్ పాండే ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను వివరణ కోరారు. ఈ ఘటనను తాను ఖండిస్తున్నానని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్ రంజన్ ప్రసాద్ అన్నారు. దీనిపై విచారణ జరిపి దీనికి కారణమైన వారిని శిక్షిస్తామని ఆయన చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm