Oct 14,2019 06:47AM
హైదరాబాద్: నాంపల్లిలోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన కాలేజీని బేగంపేటకు తరలించవద్దని అక్కడ చదువుతున్న విద్యార్థినులు డిమాండ్ చేశారు. విద్యార్థినులు గాంధీభవన్‌కు వచ్చి తమకు న్యాయం జరిగేలా చూడాలని అక్కడున్న నేతలను కోరారు. అదే సమయంలో విలేకరుల సమావేశం కోసం వచ్చిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని విద్యార్థినులు కలిశారు. నాంపల్లి, ఆ ప్రాంతానికి దగ్గరలో ఉండే తాము బేగంపేటకు వెళ్లలేమని, కాలేజీని తరలించకుండా చూడాలని కోరారు. ఇప్పటికే ఫీజులు చెల్లించామని, పరీక్షలకు కూడా సిద్ధమవుతున్నామని జగ్గారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. సంబంధిత అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని విద్యార్థినులకు ఆయన హామీ ఇచ్చారు.