కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి చెందిన 100 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారంటూ ఆ పార్టీ చెప్పుకోవడాన్ని టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరిక్ ఒబ్రెయిన్ ఖండించారు. వింత వాదనలు చేయవద్దంటూ కమలనాథులకు చురకలు వేశారు. రాబోయే రెండేళ్లలో పశ్చిమబెంగాల్‌లో పార్టీ తరఫున గెలిచే సమర్ధులైన క్యాడర్ కోసం బీజేపీ ప్రయత్నిస్తోందంటూ వస్తున్న వార్తలను ఒబ్రెయిన్ ప్రస్తావిస్తూ, బెంగాల్‌లో గెలుపు మాట అటుంచి ఇతర ప్రాధాన్యతాంశాలపై ఆ పార్టీ దృష్టి సారిస్తే బాగుంటుందని అన్నారు. 2021 బెంగాల్ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలిపించేందుకు 294 మంది సమర్ధులైన కార్యకర్తలు కూడా ఆ పార్టీలో లేరనే విషయం తేటతెల్లమవుతోంది. దిలీప్ ఘోష్ (బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు) బెంగాలీ భాషను మెరుగుపరుచుకోవడంపైన, ప్రధాని మోడీ దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంపైన దృష్టిసారిస్తే బాగుంటుంది అని ఆయన అన్నారు.
Oct 14,2019 12:53PM