హైదరాబాద్ : బతికున్న కొండచిలువను కొందరు కాల్చేసి పైశాచిక ఆనందాన్ని పొందిన ఘటన గుజరాత్ లోని బనస్కాంతా జిల్లాలోని బోదల్ గ్రామంలో చోటు చేసుకుంది. అంతేగాక, ఆ సమయంలో వీడియో తీసి సామాజిక మాధ్యమం టిక్ టాక్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఘటన అధికారుల దృష్టికి వెళ్లడంతో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఆ వీడియోలోని సమాచారం ప్రకారం అటవీ శాఖ అధికారులు దీనిపై విచారణ ప్రారంభించారు. ఆ వీడియోలో ఉన్న నలుగురిలోని ఇద్దరి వివరాలను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడానికి వారి ఇంటికి వెళ్లారు. అయితే, వారు వస్తున్నారన్న విషయాన్ని గుర్తించిన ఆ ఇద్దరు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వివరించారు. ఒకవేళ వారు చేసిన ఈ నేరం రుజువైతే వారికి మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.10,000 నుంచి రూ.25,000 మధ్య జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పారు. నిందితులను అరెస్టు చేయడానికి అటవీ శాఖ ఐదు బృందాలను పంపింది.
Oct 19,2019 02:22PM