ముంబయి: ఆసియా ఛాంపియన్‌షిప్స్ కాంస్య పతక విజేత, హైదరాబాదీ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ఎవరో తనకు తెలియదని దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ అన్నారు. జరీన్ ఎవరని ప్రశ్నించారు. ఆమె మాటల్లో తానో పెద్దబాక్సర్ అన్న భావం కనిపించింది. గతంలో 48 కిలోల విభాగంలో పోటీపడే మేరీకోమ్ టోక్యో ఒలింపిక్స్ కోసం 51 కిలోల విభాగానికి మారింది. దీంతో ఎప్పుడూ ఇదే విభాగంలో తలపడే నిఖత్‌కు అవకాశం ఉండటం లేదు. ఈ మధ్యే జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌నకు సెలక్షన్స్ నిర్వహించకుండా నేరుగా మేరీనే పంపించారు. ఈ నేపథ్యంలో నిఖత్ కేంద్ర క్రీడల మంత్రికి లేఖ రాసింది. వివాదం గురించి మేరీకోమ్‌ను ప్రశ్నించగా.. 'నిఖత్ జరీన్ ఎవరు? ఆమె ఎవరో నాకు తెలీదు. ప్రస్తుత ఘటనలతో నేను షాకయ్యా. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో నేను 8 పతకాలు సాధించాను. అందులో 6 స్వర్ణాలున్నాయి. ఎవరు కావాలో భారత బాక్సింగ్ సమాఖ్య తేల్చుకుంటుంది. ఆమె ఎందుకిలా ఏడవాలి? భారత జట్టులో చోటు కోసం ఆమె లాబీ చేయకూడదు. ఇలా చేయొద్దు' అని తెలిపింది. సెలక్షన్స్‌తో అవసరం లేకుండా టోక్యో ఒలింపిక్స్‌కు ఆమెను నేరుగా పంపించేలా నిబంధనలు మార్చేందుకు బాక్సింగ్ సమాఖ్య ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న నిఖత్.. మేరీతో పోటీకి అవకాశం కల్పించాలని కిరణ్ రిజిజుకు లేఖరాసింది. ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత బింద్రా సైతం ఆమెకు మద్దతు పలికారు. ఆయనపైనా మేరీ విమర్శలు చేయడం గమనార్హం.
Oct 19,2019 08:37PM