హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. సోమవారం తలపెట్టిన ప్రగతి భవన్ ముట్టడి విజయవంతం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని ఉత్తమ్ విమర్శించారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలతో 50 వేల ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ప్రభుత్వం మెడలు వంచి ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసే వరకు పోరాడుతామని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm