గౌహతి : ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో అసోం రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2021 జనవరి 1వతేదీ నాటికి ఎవరికైనా ఇద్దరు పిల్లలుంటే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదని అసోం రాష్ట్ర మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు భూమి విషయంలోనూ కొత్త భూ విధానాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. కొత్త భూవిధానం ప్రకారం భూమి లేని వారికి మూడు బిగాల వ్యవసాయ భూమితోపాటు ఇంటి నిర్మాణం కోసం సగం బిగా స్థలాన్ని ఇవ్వాలని అసోం రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. ఇలా ఇచ్చిన భూమిని 15 సంవత్సరాల పాటు విక్రయించడానికి వీలు లేదని అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ప్రకటించారు. అసోం జనాభా, మహిళా సాధికారత విధానాన్ని అసోం అసెంబ్లీ 2017 సెప్టెంబరులోనే ఆమోదించింది. ఆ విధానం ప్రకారం ప్రభుత్వ సిబ్బంది ఇద్దరు పిల్లలను మాత్రమే కనాలనే కుటుంబ ప్రమాణాన్ని ఖచ్చితంగా పాటించాలి. కేబినెట్ సమావేశం రాష్ట్రంలో బస్సు ఛార్జీలను 25 శాతం పెంచాలని అసోం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
Oct 22,2019 11:25AM