బేగంపేట: ఇంట్లో పడుకున్న వ్యక్తిని..తెల్లవారుజామున పనికి రావాలని బయటకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఉదయం బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బేగంపేట రసూల్‌పుర విమలానగర్‌కు చెందిన మాజిద్(40) భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అదే ప్రాంతంలోని అర్జున్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. మాజిద్ సెంట్రింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి.. మాజిద్‌ను నిద్రలేపి పని ఉందంటూ బయటకు తీసుకుపోయారు. కొద్ది దూరం తీసుకువెళ్లి.. ఒక్కసారిగా కత్తులతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలతో మాజిద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్లూస్ టీం బృందంతో స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Oct 23,2019 06:40AM