నెల్లూరు : విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన కొందరు ఉపాధ్యాయులు క్రమశిక్షణ తప్పుతున్నారు. మాట వినని వారిని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే దుత్తలూరు మండలం నందిపాడు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో గురువారం జరిగింది. బాధిత బాలిక తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు... బుధవారం రాత్రి విద్యాలయంలో ఆంగ్ల ఉపాధ్యాయిని ప్రవీణకుమారి ఓ విద్యార్థిని పిలిచి నా కాళ్లు ఒత్తు... రోజుకు రూ. 100 ఇస్తానని చెప్పింది. దీనికి ఆ విద్యార్థిని ససేమిరా అనడంతోపాటు తోటి విద్యార్థినులతో మేము చదువుకోవడానికి వచ్చింది... ఇలా కాళ్లు పట్టుకోవడానికి కాదు అని చెప్పింది. ఈ విషయం సదరు ఆంగ్ల ఉపాధ్యాయినికి చేరడంతో ఆ విద్యార్థినిని తీవ్రంగా మందలించింది. మనస్థాపానికి గురైన బాలిక ఈ విషయాన్ని బుధవారం రాత్రి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పింది. వారు గురువారం ఉదయం పాఠశాలకు వచ్చి ఆందోళన చేశారు. చదువు చెప్పకుండా ఇలాంటి పనులు చేయించుకుంటారా అంటూ తల్లిదండ్రులు ధ్వజమెత్తారు. ఇంకోసారి ఇలా జరిగితే సహించేది లేదంటూ హెచ్చరించారు. విషయం జిల్లా ఎస్‌ఎస్‌ఏ పీవోకు తెలియడంతో ఆయన వెంటనే జీసీడీవో లక్ష్మమ్మను విచారణకు పంపించారు. విచారణకు వచ్చిన జీసీడీవో విద్యార్థిని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయినితో విడివిడిగా మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం జీసీడీవో మాట్లాడుతూ జరిగిన విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని, సదరు ఉపాధ్యాయినిని వేరే పాఠశాలకు బదిలీ చేసేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.
Mon Jan 19, 2015 06:51 pm