హైదరాబాద్: సమ్మె విషయంలో న్యాయస్థానం నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదాపడిన తర్వాత అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు.. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఉండాలని సూచించారు. ఇప్పటికైనా కోర్టు సూచన మేరకు కమిటీ వేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కోర్టులో ఇరు పక్షాల వాదనల తర్వాత ముగ్గురు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులతో కమిటీ వేయాలని హైకోర్టు సూచించింది. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడి రేపు మధ్యాహ్నంలోపు కమిటీ ఏర్పాటుపై అభిప్రాయం వెల్లడిస్తామని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు చెప్పారు. మేం కూడా ముఖ్యమంత్రిని అదే కోరుతున్నాం. కమిటీ వేసి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించాలి. ఎలాంటి భేషజాలకు పోకుండా వెంటనే కమిటీని ఏర్పాటు చేసి కోర్టు సూచన మేరకు చర్చల ప్రక్రియ ప్రారంభించాలని కోరుతున్నాం. కోర్టు ఆదేశాలు, కమిటీ నిర్ణయం మాకు అంగీకారమే. కమిటీకి కూడా కాలపరిమితి ఉంటుందని భావిస్తున్నాం. ప్రభుత్వం కమిటీ వేస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నాం. సమ్మె చట్ట విరుద్ధమని చెప్పడానికి వీల్లేదని కోర్టు తెలిపింది. అని అశ్వత్థామరెడ్డి మీడియాకు వివరించారు.
Nov 12,2019 05:47PM