Nov 12,2019 07:25PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా రోమ్ చక్రవర్తి నీరో ప్రభు వల్లే వ్యవహరిస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా అప్రజాస్వామికంగా తయారైందని, అన్ని శాఖల్లో పనులు కుంటుపడిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో డెంగీ, విష జ్వరాలకు లక్షలాది మంది గురవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విష జ్వరాలపై హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వంలో ఏ మాత్రం కదలిక లేకపోవడం విచారకరమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని వీరభద్రం చెప్పారు.