బెంగళూరు : నగరంలో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న బీజేపీ నేత బీటీ శ్రీనివాస్ కుమారుడిని కిడ్నాప్ చేసేందుకు ఇద్దరు దుండగులు విఫలప్రయత్నం చేశారు. ఈ ఘటన నగరంలోని సోలదేవనహళ్ళి పరిధిలో చోటు చేసుకుంది. దుండగులు శ్రీనివాస్ నివాసం వద్ద ఉన్న పలు వాహనాలకు నిప్పటించి పరారయ్యే ప్రయత్నం చేయగా పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన మహ్మద్ రియాజ్ (21), మహ్మద్ బాసిత్ (21) కాళ్లకు తూటాలు తగిలాయి. వీరిని తక్షణం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని ఉత్తర విభాగం డీసీసీ శశికుమార్ వెల్లడించారు. దాసరహళ్ళిలోని నీలం మహేశ్వర రోడ్డులో వాటర్‌ప్లాంట్ నిర్వహిస్తున్న బీటీ శ్రీనివాస్ కుమారుడు శరత్‌ను కిడ్నాప్ చేసేందుకు దుండగులు కుట్రపన్నినట్టు పోలీసుల విచారణలో తేలింది. తమిళనాడుకు చెందిన ఇద్దరు నిందితులు బెంగళూరులోనే తిష్టవేసి చిన్న చిన్న నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఈ మేరకు సోలదేవనహళ్ళి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Nov 13,2019 10:31AM