Nov 14,2019 06:50PM
బెంగళూరు: 180 మంది ప్రయాణికులతో నాగ్‌పూర్ నుంచి బెంగళూరుకు వచ్చిన గోఎయిర్ విమానం త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. ల్యాండింగ్ సమయంలో వెలుతురు సరిగా లేని కారణంగా విమానం రన్‌వే పక్కకు దూసుకెళ్లింది. సోమవారం ఉదయం 7:15 గంటల సమయంలో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎ-320 రకం విమానమైన జి8-811 ల్యాండింగ్ సమయంలో ఎయిర్‌స్ట్రిప్ బయట ల్యాండ్ అయింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. విమాన పైలెట్లు ఇద్దరికీ సమన్లు ఇచ్చిన డీజీసీఏ శుక్రవారం తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. కాగా, ఈ ఘటనపై గో ఎయిర్ సంస్థ ఇప్పటి వరకు స్పందించలేదు.