Nov 17,2019 06:13AM
తిరుమల: తిరుమలలోని పార్వేట మండపం వద్ద ఆదివారం కార్తీక వనభోజన సమారాధన కార్యక్రమం వేడుకగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 8.30 గంటలకు మలయప్పస్వామి వాహనమండపం నుంచి చిన్న గజవాహనంపై, ఉభయ నాంచారులు పల్లకిపై బయల్దేరి ఊరేగింపుగా పార్వేట మండపానికి వేంచేస్తారు. 11- 12 గంటల నడుమ ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల వరకు భక్తులకు కార్తీక వనభోజన వితరణ జరుగుతుంది. అలాగే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల ఆధ్వర్యంలో సంకీర్తన గోష్టి నిర్వహిస్తారు. వనభోజన ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేశారు.