Nov 17,2019 07:39AM
హైదరాబాద్: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా నేడు పదవీ విరమణ చేయనున్న రంజన్ గొగోయ్, ప్రస్తుతం తిరుమలలో ఉన్నారు. నిన్న సాయంత్రం స్వామివారిని దర్శించుకున్న ఆయన, ఆపై న్యూఢిల్లీకి వెళతారని భావించినా, ఆయన వెళ్లలేదు. తన కుటుంబీకులతో కలిసి, నిన్న రాత్రి ఏడుకొండలపై నిద్ర చేసిన ఆయన, ఈ ఉదయం పలు ఆర్జిత సేవల్లో పాల్గొంటున్నారు. స్వామివారిని మరోసారి దర్శించుకోవాలని తనకు అనిపించిందని, అందుకే, తాను ఇక్కడే ఉన్నానని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇటీవలి కాలంలో పలు కీలక తీర్పులను ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే. అయోధ్య, రాఫెల్, శబరిమలకు మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లు, ఃచౌకీ దార్ చోర్ హైః అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన తన తీర్పులను వెల్లడించారు. తన చివరి పనిదినాన్ని సైతం గొగోయ్, తిరుమలలోనే గడపడం గమనార్హం.