Nov 17,2019 11:49AM
బాలాసోర్: మొదటిసారి రాత్రిపూట నిర్వహించిన అగ్ని - 2 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఓడిషాలోని బాలాసోర్‌లో ఉన్న డాక్టర్ అబ్దుల్ కలాం ద్వీపంలో శనివారం సాయంత్రం ఈ పరీక్షలు నిర్వహించినట్టు రక్షణశాఖ అధికారులు తెలిపారు. భూతలం నుంచి భూతలంలో ఉన్న లక్ష్యాలను ఛేదించేందుకు ఈ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ఉపయోగిస్తారు. ద్వీపంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) కాంప్లెక్స్ 4 నుంచి దీన్ని పరీక్షించారు. 20 మీటర్ల పొడవు, సుమారు 17 టన్నుల బరువున్న ఈ క్షపణికి 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంది. దీంతోపాటు మరో 1000 కేజీల పేలోడ్‌ను ఇది మోసుకెళ్లగలదని అధికారులు చెబుతున్నారు. మొత్తం రెండు దశల్లో పని చేస్తుందని తెలిపారు. అగ్ని - 2 క్షిపణిని మొదటిసారి 1999 ఏప్రిల్ 11న పరీక్షించగా.. చివరగా 2018 ఫిబ్రవరి 20న టెస్ట్ చేశారు.