వనపర్తి: వనపర్తి జిల్లా మదనాపురం జూనియర్ గురుకుల కళాశాల విద్యార్థి శ్రీకాంత్ మృతిపై సమగ్ర విచారణ జరపాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకాంత్ మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, గురుకులాలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు అనుమానాస్పదంగా మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని చెప్పారు. ప్రభుత్వమే బాధ్యత వహించి ఒక్కో విద్యార్థి కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం, మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంఈఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గద్వాల కృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థిది ఆత్మహత్య కాదని హత్యేనని అన్నారు. అనంతరం కలెక్టర్ శ్వేతామహంతికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో భగత్, రాధాకృష్ణ, గంథం లక్ష్మయ్య, గణేష్, ఆది, రాజశేఖర్, విద్యార్థి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Nov 19,2019 09:23AM