హైదరాబాద్ : పురపాలక శాఖమంత్రి కేటీఆర్ ఈరోజు హెచ్‌ఎండీఏ కార్యక్రమాలపైన సమీక్ష నిర్వహించారు. బుద్దభవన్‌లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో హెచ్‌ఎండీఏ చేపట్టిన కార్యక్రమాల పురోగతిని, ప్రణాళికలను చర్చించారు. ముఖ్యంగా నగరంలో ఉన్న ప్రధాన సరస్సులైన హూస్సేన్ సాగర్, దుర్గం చెరువు, గండిపేట చెరువుల అభివృద్దిపైన ఈ సమావేశంలో చర్చించారు. పలువురు కన్సల్టెంట్లు తయారు చేసిన మాస్టర్ ప్లాన్లను ఈసందర్భంగా పరిశీలించారు. ముఖ్యంగా హూస్సేన్ సాగర్, గండిపేట చెరువుల అభివృద్ది కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలను కన్సల్టెంట్లు వివరించారు. జలాశయాల సహజత్వాన్ని కాపాడుతూ, నగర ప్రజలకు అహ్లదం పంచేతీరుగా ఈ మాస్టర్ ప్లానింగ్ ఉండాలని ఈ సందర్భంగా మంత్రి సూచన చేశారు. గండిపేట వద్ద పార్కు కోసం హెచ్‌ఎండీఏ తయారు చేసిన ప్రణాళికలకు అమోదం తెలిపిన మంత్రి, త్వరలోనే అక్కడ పనులు ప్రారంభించాలని అదేశించారు. దీంతోపాటు గండిపేట జలాశయం చుట్టురా సూమారు 40 కీలోమీటర్ల మేర వాకింగ్ ట్రాకులు, సైక్లింగ్ ట్రాకులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు ప్రారంభించాలని, ఇందుకోసం జిల్లా యంత్రాంగం, నీటి పారుదల శాఖాధికారులతో సమన్వయం చేసుకోవాలని కోరారు.
Nov 21,2019 06:42PM