హైదరాబాద్ : భారత్‌కు చెందిన భద్రతా సిబ్బంది లక్ష్యంగా పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో భారత ఆర్మీ తమ సిబ్బందికి కీలక సూచనలు చేసింది. సత్వరమే తమ ఫోన్‌లో వాట్సప్ సెట్టింగ్స్‌ను మార్చుకోవాలని సూచించింది. భారత్‌కు చెందిన ఓ ఆర్మీ జవానును పాక్ చెందిన ఓ అనుమానిత ఫోన్ నంబర్ ద్వారా వాట్సప్ గ్రూప్‌లో చేర్చినట్లు ఆర్మీ పేర్కొంది. అయితే, వెంటనే సదరు ఆర్మీ జవాను అప్రమత్తమై ఆ గ్రూప్ నుంచి వైదొలిగి ఆ గ్రూప్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను తీసుకున్నట్లు పేర్కొంది. దీనిబట్టి ఐఎస్‌ఐ ఆర్మీ వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు అర్థమవుతోందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు వెంటనే వాట్సప్‌లో సెట్టింగ్స్ మార్చుకోవాలని ఆర్మీ సూచించింది. కేవలం ఫోన్ కాంటాక్టుల్లోని వ్యక్తులు మాత్రమే గ్రూపుల్లో చేర్చేలా సెట్టింగ్స్‌ను మార్పు చేసుకోవాలని సూచించింది. ఇటీవల పాక్ గూఢచారులు సోషల్‌మీడియా ఖాతాల ద్వారా ఇద్దరు ఆర్మీ జవాన్లపై వలపు వల విసిరిన ఉదంతం వెలుగు చూసిన నేపథ్యంలో ఈ సూచనలు చేయడం గమనార్హం.
Nov 22,2019 07:54PM