బీజింగ్: కొవిడ్-19 వ్యాధిని అదుపు చేయడంలో చైనా క్రమంగా పురోగతి సాధిస్తున్నట్టే కనిపిస్తోంది. అక్కడ కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య నెమ్మదిస్తోంది. అయితే ఈ పురోగతిలో వైద్యులు, ఇతర సిబ్బంది పాత్ర ఎంతో ఉంది. ప్రాణాపాయాన్ని కూడా లెక్క చేయకుండా వారు పేషంట్లకు నిరంతరం సేవలందించారు. అయితే.. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే పేషెంట్ల బాగోగుల కోసం అక్కడి వైద్య సిబ్బంది ఎంతగా పరితపిస్తున్నారో అర్థమవుతుంది. ఆన్‌హూయ్ ప్రావిన్స్‌లోగల ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు కరోనా బాధితులు కోలుకున్నారు. ఎంతోకాలంగా ఈ గుడ్ న్యూస్ కోసమే ఎదురు చూస్తున్న వైద్య సిబ్బంది పేషెంట్లను చూసి సంబరపడిపోయారు. వారి ఆనందానికి పట్టపగ్గాలేకుండా పోయాయి. వారందరూ ఏకంగా ఆసుపత్రి వెలుపలకు వచ్చి గెంతులేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ శుభవార్తను స్థానికులతో పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు.. అక్కడి సిబ్బంది తీరుకు అబ్బురపడుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm