మరణవేదన అనుభవించే వ్యక్తి ధైర్యంగా ఉండలేడంటాడు కింగ్ రిచార్డ్-2లో షేక్స్‌పియర్. పర్స 450 ఏళ్ళ క్రితం పుట్టి ఉంటే లేదా షేక్స్‌పియర్ 2015లో ఉండి ఉంటే ఆ మాట అనగలిగి ఉండే వాడా అనిపించింది. కన్నీటిని కావిలించుకునే వారిని అరుదుగా చూస్తాం. కోరి కష్టాల సుడిగుండంలో దూకే గుండె ధైర్యం ఎందరికుంటుంది? వీటి మానవ రూపమే పర్స. ''ఒక్క రోజైనా, ఒక్కసారైనా- కమ్యూనిస్టుగా బతుకు నేస్తమా''..అన్న పాట వింటుంటే ఒకటికాదు, రెండు కాదు డెబ్బయి రెండేండ్లు (1943-2015) కమ్యూనిస్టుగా నిండు జీవితం గడిపిన పర్స సత్యనారాయణ వంటి వాళ్లను గురించి తెలుసుకోవడం నేటి తరానికి అవసరం.
వడ్డించిన విస్తట్లో పుట్టిన మన తరం కార్యకర్తలు పప్పులో ఉప్పు తగ్గిందని, కూర సరిగా ఉడకలేదని పెడ్తున్న పేచీలు చూస్తున్నాం. కుటుంబ సభ్యులకు జబ్బు చేయంగానే కార్పొరేట్ వైద్యానికి పరుగులెత్తడం చూస్తున్నాం. పర్సా వంటి నాయకుల జీవితాలను చదివితే కష్టాలు పడటానికి రన్నింగ్ రేస్ పెట్టుకున్నారా అనిపిస్తుంది. 2010లో కిందపడి తుంటి ఎముక ఫ్రాక్చరయింది. గాంధీ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు. మాజీ ఎమ్మెల్యేకు కార్పొరేట్ వైద్యం చేయించుకునే అవకాశం ఉన్నా దాని గురించి ఆయన ఆలోచించలేదు. అది ఆయన క్రమశిక్షణ. ఎందుకంటే, ఆయనకొచ్చే శాసనసభ్యుల పింఛన్ పార్టీ రాష్ట్ర కేంద్రంలో జమవుతుంది. గనుక మిగతా వారిలాగే ఆయనా అలవెన్స్ పైనే బ్రతికేవారు. 1962లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎమ్మెల్యే పదవిని ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఉపయోగించాలన్న నిండు లక్ష్యంతో పనిచేశారు. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు అధికారులతో సంప్రదింపులు జరిపేవారు.
ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో అరెస్టయిన పర్సా రెండు సార్లు ఔరంగాబాద్ జైలు గోడలు దూకి తప్పించుకున్నారు. దీంతో పర్సా సత్యనారాయణ కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టిన నైజాం సర్కార్ ఆయన్ని డేంజరస్ ప్రిజనర్‌గా ప్రకటించింది. సాధారణంగా ఖైదీలను ఉంచే చెరసాలలో కాకుండా ఆయనను ఆరడుగుల పొడవు, 8అడుగుల ఎత్తున్న చీకటి చెరసాలలో నెలల తరబడి బంధించింది. అయినా మొక్కవోని దీక్షతో ప్రజా శ్రేయస్సుకోసమే తుది శ్వాస వరకు నిలబడడం పర్స ప్రత్యేకత.
Sat 27 Oct 02:58:16.08527 2018