రాష్ట్రాన్ని ఇన్నేండ్లూ ఏలినోళ్లెవరూ సాగును బాగు చేయలేదు. రైతాంగాన్ని ఆదుకోలేదు. తాము చేస్తామని గద్దెనెక్కిన టీఆర్‌ఎస్ సైతం సాగును సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు ఏ ఒక్క శాశ్వత చర్యా చేపట్టలేదు. రుణసాయం, పంటలకు గిట్టుబాటు ధర వంటి కీలక అంశాలను సైతం టీఆర్‌ఎస్ విస్మరించింది. నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నా చోధ్యం చూసింది. విపత్తుల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునే దిశగా స్వయంగా ఏ ఒక్క చర్యా తీసుకోలేదు. పోగా కేంద్రాన్నీ నిలేసి అడగలేదు. 10 శాతానికి మించి రుణ సదుపాయాన్నీ కల్పించలేదు. సాగుకు అప్పులే ఆధారమయ్యాయి. ఫలితంగా తెలంగాణ వచ్చాక ఏటా సగటున 830 మంది రైతులు బలవన్మరణం చెందారు. ఈ కష్టాల నుండి గట్టెక్కించేందుకు, సేధ్యానికి భరోసా, రైతుకు భాసట కల్గించే ప్రణాళికతో బీఎల్‌ఎఫ్ ముందుకొచ్చింది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు మద్దతు ధరలు ప్రకటిస్తామని చెప్పింది. అంతే కాదు మార్కెట్లో దళారులను నిలువరించి దాని అమలు చేసే బాధ్యత తమదే అని భరోసా ఇస్తోంది. మార్కెట్ స్థిరీకరణ కోసం ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేసి రైతుల పంటలను నేరుగా కొంటామని తమ మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన రైతులకు 2013 చట్టం ప్రకారమే పరిహారం చెల్లిస్తామని హామీ ఇస్తున్నది. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న కౌలు రైతుల రక్షణ కోసం టీఆర్‌ఎస్ సర్కారు ఏమీ చేయలేదని, తాము అధికారంలోకొచ్చాక కౌలు చట్టాన్ని అమలు చేస్తామని తమ ఎన్నికల నివేదికలో పేర్కొంది. ఇన్నాళ్లూ బూర్జువా పార్టీల ఎన్నికల నినాదాలతో మోసపోయిన రైతులు, కౌలురైతులు, వ్యవసాయ కూలీల్లో దీనిపట్ల స్పందన కనిపిస్తోంది.
Sat 27 Oct 03:49:09.630936 2018