ఫలానా పార్టీకి చెందిన అభ్యర్థి అని భ్రమపడి ఓట్లేయొద్దు. ఎందుకంటే గెలిచిన తర్వాత ఎవరు ఏ పార్టీలోకి పోతరో తెలియదు. ఒక పార్టీని, నాయకత్వాన్ని సాయంత్రం తిట్టి మర్నాడు పొద్దున్నే పొగిడేటోళ్లను ఎందరినో చూస్తున్నాం. అధికార పార్టీలోకి చేరి 'బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పాటుపడటానికి పార్టీ మారినం' అన్న ఎంతోమంది.. ఇప్పుడు నియంత పాలన ఉన్నది కాబట్టి బైటికి వచ్చినం అంటున్నారు. ఆ బయటకు వచ్చినవాళ్లు మళ్లీ అదే పార్టీలో చేరినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఇతర పార్టీ అభ్యర్థులను లాక్కోవడం షరా మాములే..! సీమాంధ్ర నాయకత్వం మనకు అవసరమా అంటున్న వారు గతంలో వాళ్లతో పొత్తులు పెట్టుకున్న వారే. అప్పుడు ఆ నాయకత్వాన్ని ఆకాశానికెత్తి, ఇప్పుడు పాతాళానికి దించేస్తున్నారు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి స్టేట్‌మెంట్లు మారడమూ గమనిస్తున్నాం. ఒకటీ రెండూ పార్టీలకు మినహా ఎవరికీ ఒక సిద్ధాంతం లేదు, పాడూ లేదు.
గతంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ మ్యానిఫెస్టో అయినా అమలయినదా? నాయకులు గద్దెనెక్కగానే బుట్టదాఖలు అవుతూనే ఉంటాయి. గెలిచినాక ప్రచారంలో ఏం హామీలిచ్చిర్రో గుర్తుకుండేనా? ఎన్నికల్లో పెట్టిన పెట్టుబడి రాబట్టుకొని, మళ్లీ వచ్చే ఎన్నికల కోసం అడ్డగోలుగా జమచేసుకోవాలి, మళ్లీ టికెట్ కొనుక్కోవాలి. హంగులు, ఆర్భాటాలు, కలలను సాకారం చేసుకొవడంలోనే లీడర్ల కాలం వెళ్లిపోతది.. ఇక ప్రజల గురించి ఆలోచించే నాయకుడు ఎవరు?
ఇప్పుడెంత సౌమ్యంగా కనబడుతున్నారో తర్వాత అంత కఠినంగా వ్యవహరిస్తారు ప్రజలతో. కానీ ప్రచారంలో మాత్రం నీళ్లు తోడిపెడతరు, బియ్యం కడుగతరు, బాసన్లు తోమిపెడతరు..నానా తంటాలు పడతరు. అతి వినయాన్ని ప్రదర్శిస్తూ ఆప్యాయంగా పలకరిస్తారు, దండం పెడతారు, చిరునవ్వులు చిందిస్తారు, మన మనిషిలెక్కే నటిస్తారు, మనకే ఎదురు డబ్బులిచ్చి చూపించి, మత్తులో దించి, ఐదేండ్లు పాతాళంలోకి అణగదొక్కే కుట్రపూరిత ప్రక్రియ వీరిది. ప్రజల నెత్తి మీద అడుగు పెట్టి, ఉవ్వెత్తున ఆకాశానికి ఎగరడానికి సిద్ధమై ఉన్నారు ప్రజా ప్రతినిధులు. బీ కేర్ఫుల్! మన ఇబ్బందులు తెలిసినోడికి, మన కాడ ఉండేటోనికి ఆచితూచి సమర్ధవంతుడిని ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోవాలని మనవి. మనకున్న ఒకే ఒక్క బలం ఓటు హక్కు. ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల ఐదేండ్లు వెనుక బడిపోతాము. ఈ సారైనా మన ఊరిని మన ఎదుగుదలను మాయ మాటలకో, మందుకో, నోటుకో తాకట్టుపెట్టవద్దని ప్రతిజ్ఞ చేసుకుందాం. మనలోంచి ఒక మంచి మనిషిని మన ప్రతినిధిగా బలపరుచుకుందాం..!
-రఫీ
Sun 28 Oct 03:55:21.418548 2018