అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ సమయంలో నియమనిబంధనలపై కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలు విధించింది. అవేమిటో తెలుసుకుందామా!
ఎమ్మెల్యేగా పోటీచేసే అభ్యర్థి వయసు 25ఏండ్లు ఉండాలి.
ఫారం-2బీ నామినేషన్ పత్రాలు పూర్తిచేసి ఎన్నికల అధికారికి అందజేయాలి. దీనిలో రాష్ట్రంలో ఎక్కడైనా ఓటు హక్కు తప్పనిసరి. సొంత నియోజకవర్గం నుంచి కాకుండా మరో చోట పోటీ చేసే అభ్యర్థి తనకు ఓటు హక్కును ధృవీకరించే పత్రాన్ని నామినేషన్ పత్రానికి జతచేయాలి. అభ్యర్థిని ప్రతిపాదించే వారు మాత్రం కచ్చితంగా అదే నియోజకవర్గ ఓటరై ఉండాలి.
జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో రిజిస్టరైన పార్టీల అభ్యర్థులు అంటే ఎన్నికల 'బి' ఫారాలు ఇచ్చే అభ్యర్ధులకు నామినేషన్ పత్రాల్లో ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. స్వతంత్ర అభ్యర్థిని మాత్రం పది మంది ఓటర్లు ప్రతిపాదించాలి.
ఫారం-26ను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిలో అభ్యర్థి వారి భార్య/భర్త వృత్తి, ఉద్యోగం వివరాలతో పాటు వారి జీతభత్యాల గురించి రాయాలి. అభ్యర్థి పాన్‌నెంబర్‌తో పాటు కుటుంబంలో అతనిపై అధారపడి ఉన్న ప్రతి ఒక్కరి ఇన్‌కమ్ టాక్స్ విషయాలు పొందుపరచాలి. వీటి వివరాలు కూడా ఇవ్వాలి. వీటిలో ఏ కాలమ్ వదిలిపెట్టకూడదు. అలాగే, నిల్, నాట్‌అప్లికబుల్, తెలియదు లాంటివి రాయకూడదు.
అలాగే, ప్రభుత్వానికి ఏవిధమైన బాకీలు లేకుండా చూసుకోవాలి. అంటే.. కరెంట్, వాటర్, ఇన్‌కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్.. ఇలా పదేండ్లకు చెందిన వివరాలు తప్పనిసరిగా విడిగా ఓ అఫిడవిట్ లో ఇవ్వాలి.
అభ్యర్థి నేరచరితకు సంబంధించిన విషయాలు తప్పకుండా రాయాలి. ఏవైనా కేసులు పెండింగ్‌లో ఉంటే.. వాటిని కూడా పొందుపరచాలి.
రూ.10వేలు డిపాజిట్ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5వేలు చెల్లిస్తే సరిపోతుంది. జనరల్ స్థానాల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సైతం ఈ నిబంధన వర్తిస్తుంది. కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలి.
ఎన్నికల్లో చెల్లుబాటైన ఓట్లలో కనీసం 1/6 వంతు ఓట్లు పొందిన అభ్యర్థికి మాత్రమే డిపాజిట్ తిరిగి చెల్లిస్తారు. అంతకన్నా తక్కువ వస్తే డిపాజిట్ కోల్పోవడం అంటారు.
ప్రభుత్వోద్యోగులు ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడానికి అనర్హులు. ముందుగా ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన వారు మాత్రమే నామినేషన్ దాఖలు చేయాలి.
2014లో ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శక సూత్రాల ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర అభ్యర్థుల నియోజకవర్గంలో ఎన్నికల ఖర్చు 28లక్షలుగా నిర్ణయించింది.
'బీ ఫాం' లేకపోతే గుర్తింపుండదు..
ఎన్నికల సమయంలో 'బీ ఫాం' అని విటుంటాం. దీంతో పాటు 'ఏ ఫాం' కూడా ఉంటుంది. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి నామినేషన్‌కు 'బీం ఫాం' తప్పనిసరి. పార్టీ తరఫున పోటీ చేయడానికి అధికారికంగా ఇచ్చే ధ్రువీకరణ పత్రమే 'బీ ఫాం'. సదరు అభ్యర్థి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి 'బీం ఫాం' దాఖలు చేయకపోతే అతనిని ఇండిపెండెంట్‌గా ప్రకటించి పార్టీ గుర్తు కాకుండా ఇతర గుర్తును కేటాయిస్తారు. కొన్ని సందర్భాల్లో పార్టీలు ఒకరికి మించి 'బీ ఫాం'లు ఇస్తాయి. అప్పుడు ఎవరు ముందుగా ఎన్నికల అధికారికి 'బీం ఫాం' అందజేస్తారో వారినే పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కోసారి పార్టీ అభ్యర్థిని నిర్ణయించినా 'బీం ఫాం' ఇవ్వడం ఆలస్యమైతే 'ఏ ఫాం' అందజేస్తారు. తర్వాత గడువులోగా 'బీం ఫాం' దాఖలు చేస్తారు.
Mon 12 Nov 03:13:05.185281 2018