- పోలింగ్‌ను బహిష్కరిస్తున్నాం : మధ్యప్రదేశ్‌లో వెలిసిన పోస్టర్లు
భోపాల్ : 'మా కాలనీలు అధికారికంగా గుర్తింపు పొందలేదు. అలాంటప్పుడు చట్టబద్ధంగా ఎలా ఓటు వేస్తాం' అంటూ మధ్యప్రదేశ్‌లో కాలనీల ప్రజలు తిరగబడుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 28న జరిగే పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్టు వారు తెలిపారు. దయచేసి.. ఓట్లకోసం మా దగ్గరకు రావొద్దంటూ ఇండ్ల బయట పోస్టర్లు అంటించారు. వివరాల్లోకెళ్తే రాష్ట్రంలోని నీముచ్‌లో ఏడు కాలనీలు 25 ఏండ్ల క్రితం ఏర్పడ్డాయి. కానీ, ఇప్పటికీ ఆ కాలనీలు అధికారికంగా గుర్తింపు పొందలేదు. దీంతో కనీస అవసరాలకు వారు దూరమవుతున్నారు. కాలనీలను గుర్తించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు కాలనీవాసులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయొద్దని వారంతా నిశ్చయించుకున్నారు. అంతేకాక.. ఆ కాలనీల్లోకి ఎవ్వరూ ప్రచారానికి రాకుండా నిరసన తెలుపుతున్నారు. 'కిందటి సారి ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మా కాలనీలకు గుర్తింపుని స్తామని బీజేపీ హామీనిచ్చింది. కానీ, అధికారం చేపట్టాక ఆ సంగతే మరిచింది. 25 ఏండ్లుగా దుర్భర పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నాం. త్రాగునీటిని పక్క ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తున్నది. పారిశుధ్య వ్యవస్థ సరిగా లేదు. ఇన్ని రోజులు కాలనీ వంక చూడని ప్రజాప్రతినిధులు.. ఓట్ల కోసం మాత్రం అదే పనిగా వస్తు న్నారు. మేం చట్ట విరుద్ధంగా నివాసముంటున్నప్పుడు.. మా ఓట్లు ఎలా చట్టబద్ధం అవుతాయి?' అని కాలనీవాసి ఒకరు ప్రశ్నించారు.
Wed 14 Nov 23:54:52.086211 2018