రాష్ట్రం వచ్చిన కొత్తలో..'ఎవరెస్టుపై బడుగు బిడ్డలు', 'అత్యున్నత శిఖరంపై వసతి గృహ చిన్నారులు' వంటి వార్తలను పతాక శీర్షికన చూశాం. ప్రతిభ, పట్టుదల ఉంటే ఎవరెస్టును సైతం పాదాక్రాంతం చేసుకోవచ్చని నిరూపించారు మన బడుగు బిడ్డలు. పదమూడేండ్ల చిన్నారి మలావత్‌పూర్ణ, 15 ఏండ్ల సాదానపల్లి ఆనంద్ ఈ అరుదైన రికార్డు సాధించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని 2014 మే 25న ముద్దాడారు. అత్యంత చిన్న వయసులో ఎవరెస్టును అధిరోహించిన బాలికగా పూర్ణ ప్రపంచ రికార్డు సృష్టించి శభాష్ అనిపించారు. పైగా ఆ చిన్నారి ఓ గిరిజన బిడ్డ. ఇలాంటి వారనేక మంది ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల్లో మట్టిలో మాణిక్యాలుగా వెలుగొం దుతున్నారు. దళిత, గిరిజనులం అన్న సామాజిక తరగతి గానీ, పేదరికం గానీ వీరికి అడ్డు రావడం లేదు. బాలికలమైనా ప్రతిభలో మేటి అని చాటుతున్నారు. అన్ని రకాల కోర్సుల్లోనూ వీరు పురుషుల కంటే ముందుంటున్న స్థితీ చూస్తున్నాము. బాలికల హవా, బాలికలే టాప్ అన్న రీతిలో ఫలితాల్లో ముందుంటున్నారు.. సమాజంలో అందుతున్న అతికొద్ది అవకాశాలతోనే ఇలా ముందు పీఠిన నిలుస్తున్న బాలికలకు పాలక ప్రభుత్వాల నుండి గానీ కుటుంబం నుండి గానీ పూర్తిస్థాయి అవకాశాలిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారు. కానీ నేటికీ బాలికలు అన్నింటా వివక్ష ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విద్యలో వీరికి ప్రోత్సాహం కరువవుతున్నది. ఆడపిల్ల చదువుకు కుటుంబంలోనూ ప్రోత్సాహం తక్కువే. ఒక వేళ చదివించినా వీరిని ప్రభుత్వ పాఠశాలలో బాలురను ప్రయివేటులో చదివిస్తున్న పరిస్థితి నేటికీ లేకపోలేదు. పాఠశాల విద్య నుండి డ్రాపవుట్స్‌లోనూ వీరిది మొదటి స్థానం. పురిట్లోనే ఈ వివక్షకు బీజం పడుతున్నది. కఠిన చట్టాలెన్ని తెచ్చినా భ్రూణ హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉన్న కొద్దిపాటి రిజర్వేషన్‌లతో ప్రజా ప్రాతినిథ్య స్థానాల్లోకి వస్తున్నా అక్కడా భర్తలదే పెత్తనం ఉంటున్నది. ఈ విధంగా బాలికలు మొదలు పెద్దయ్యాకా వీరికి వివక్ష తప్పడం లేదు. పురుషాధిక్య సమాజంలో అణచివేత కొనసాగుతూనే ఉంది. బీజేపీ ప్రభుత్వం 'బేటీ బచావో..బేటీ పడావో' పేర కొత్త పథకం తీసుకొచ్చినా అది నినాదంగానే మిగిలిపోయింది. ఆడపిల్లను 'పుట్టనిద్దాం- బతకనిద్దాం- ఎదగనిద్దాం' అన్న మాట కేవలం నినాదం కాకూడదని దీన్ని ఆచరణలో పెట్టాలని బీఎల్‌ఎఫ్ చెబుతోంది. బాలికల కోసమే 'చదువుల సావిత్రి' పథకాన్ని ముందుకు తెస్తున్నది. ఆడపిల్ల పుట్టగానే రూ.50 వేలు, ఇంటర్ పాసైతే 50 వేలు, డిగ్రీకి రూ.లక్ష, పీజీ చేస్తే రూ.3 లక్షలు, ఇంజనీరింగ్ చదువుకు రూ.5 లక్షలు అందిస్తామని తన ఎన్నికల మ్యానిఫెస్టోలో బీఎల్‌ఎఫ్ ప్రకటించింది. మెడిసిన్ వంటి ఉన్నత స్థాయి చదువులకోసం రూ.25 లక్షల వరకైనా ఖర్చు చేస్తామని పేర్కొంది.
Fri 16 Nov 22:14:44.982511 2018