- కోదండకు సహకారం సందేహమే
నవతెలంగాణ-జనగామ ప్రతినిధి
రాష్ట్రంలో జనగామ నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ నుంచి టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ పోటీచేయాలనుకోవడంతో మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బీసీ నేత పొన్నాల అడ్డు తొలగించడానికే కాంగ్రెస్‌లోని ఓ సామాజిక తరగతి వారు ఈ ఎత్తులు వేశారనే చర్చ జరగుతోంది. భవిష్యత్తులో వారికి ఆయన అడ్డు ఉండకూడదనే టీజేఎస్ పేరుతో చెక్ పెడుతున్నారనే వార్తలున్నాయి. కాంగ్రెస్ మొదటి జాబితాలోనే పొన్నాల పేరు ఉంటుందని భావించినా రెండో జాబితాలోనూ మొండిచేయి చూపారు. కోదండరామ్ పేరు తెరమీదకు రావడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. దీనికి నిరసనగా పార్టీ జిల్లా కార్యకర్తలు మూకుమ్మడి రాజీనామాలు చేసి పార్టీని వీడటానికి సిద్ధమవుతున్నారు. మొదట కోదండరామ్ రామగుండం లేదా వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. రెండు రోజుల్లో కాంగ్రెస్ జాబితా విడుదల అవుతుందనకునే క్రమంలో అనూహ్యంగా జనగామ నుంచి కోదండరామ్ పోటీచేస్తారని వార్త బయటకొచ్చింది. జనగామ టికెట్ టీజేఎస్ కోరుతున్నా అక్కడి నుంచి కోదండరామ్ బదులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి బరిలోకి దిగే అవకాశాలు న్నాయి. ఈ పరిణా మాలన్నింటినీ గమనిస్తే బీసీ నేత పొన్నాలను ఎదగకుండా చేయాలనే కుట్రతో బలమైన సామాజిక తరగతి ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగు తోంది. పొన్నాలకు జరుగుతున్న అన్యాయంపై బీసీ సంఘాలు సైతం మండిపడుతున్నాయి. పొన్నాల అంశంతో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఏకమై కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు కూడా ఉన్నాయని బీసీ సంఘాలు తెలుపుతున్నాయి. జనగామలో టీజేఎస్ పోటీ చేస్తే కోదండరామ్ బీసీ వ్యతిరేకి అనే అపవాదును మూటగట్టుకునే అవకాశాలున్నాయని వారంటున్నారు. బీసీలకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఇప్పటికే 17న బంద్ నిర్వహించాలని ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు అనేక సంఘాలు కూడా మద్దతిచ్చాయి.
కోదండరామ్‌కు లాభమా..నష్టమా..
కోదండరామ్ జనగామకు రావడం లాభమా.. నష్టమా అన్న చర్చ కూడా జరుగుతోంది. జనగామలో టీజేఎస్‌కు క్యాడర్ కూడా లేదు. ఇక్కడ సీపీఐ, టీడీపీల బలం కూడా నామమాత్రమే. పొన్నాల కాకుండా కోదండరామ్ పోటీ చేస్తే కాంగ్రెస్ క్యాడర్ సహకరించే అవకాశాలు తక్కువ. కేవలం రెడ్డి సామాజిక తరగతిపైనే ఆధారపడి పోటీ చేయాలి. అయితే టీఆర్‌ఎస్ అభ్యర్థి కూడా అదే సామాజికానికి చెందిన వ్యక్తే. జనగామతో ప్రత్యక్ష సంబంధాలున్న పొన్నాల బదులు కోదండరామ్ పోటీచేస్తే ఓటర్లు ఆదరించే అవకాశాలు తక్కువేనని రాజకీయ పరిశీలకుల అంచనా. మొత్తంమీద జనగామ నుంచి కోదండరామ్ పోటీ చేయడం లాభం కంటే నష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Fri 16 Nov 22:23:09.405977 2018