- బరిలో బీఎల్‌ఎఫ్..బడుగుల్లో జోష్
- ప్రత్యక్ష పోరాటాలతో చట్టసభలో ప్రాతినిథ్యం దిశగా..
- తొలిసారి అసెంబ్లీకి తలపడుతోన్న జయలక్ష్మి
- మొత్తం ఓటర్ల సంఖ్య 2,17,958
- మహిళా ఓటర్లు 1,09,635మంది
ఎన్నికలప్పుడు మాత్రమే లీడర్లు జనం మధ్యకు వస్తారు. ఆమె అట్లా కాదు. నిరంతరం పబ్లిక్‌తో మమేకవుతారు. మహిళా లోకం గొంతవుతారు. స్త్రీ సమస్యలపౖౖె గళమెత్తుతారు. అంగన్‌వాడీలు, ఆశాలు వంటి వేలాదిమందికి ధీమానిస్తారు. వారి సాధకబాధకాలకు అండగా నిలుస్తారు. ప్రత్యక్ష పోరాటాలతో ప్రభుత్వాలను కదిలించేందుకు ప్రయత్నిస్తారు. బీదలు అన్ని రంగాల్లో బాగుపడాలని అనునిత్యం తపించే సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు పి.జయలక్ష్మి తొలిసారి అసెంబ్లీ బరిలో నిలిచారు. బీఎల్‌పీ పక్షాన అందోల్ స్థానం నుంచి మహిళాశక్తిని చాటేందుకు కొంగు బిగించారు!
బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) బలపరిచిన బహుజన లెఫ్ట్ పార్టీ (బీఎల్‌పీ) అందోల్ అభ్యర్థి పి.జయలక్ష్మి స్థానిక రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశమయ్యారు. ఒక మహిళా అభ్యర్థినిగా నియోజకవర్గం ప్రజల దృష్టి ఆకర్శిస్తున్నారు. గ్రామాలు, మండలాల్లో కలియ తిరుగుతున్నారు. స్వతహాగా చక్కటి వాగ్దాటి గల జయలక్ష్మి ప్రచార పర్వంలో ముందు వరుసలో ఉన్నారు. ఈ నెల 13న జోగిపేటలో నామినేషన్ దాఖలు చేసిన ఆమె అంతకు ముందే అనేక ఊళ్లలో పర్యటించారు. పుల్కల్, అల్లాదుర్గం, రేగోడ్ వట్‌పల్లి, రాయికోడ్‌లలో మండలాల వారీగా ప్రధాన సమస్యలపై నిర్దిష్టమైన అవగాహనతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల వైఫల్యాలపై దండెత్తుతున్నారు. స్థానికంగా ఇన్నాండ్లూ ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహించిన లీడర్ల ఉదాశీనతను ప్రభావమంతంగా ఉటంకిస్తున్నారు. దశాబ్దాలుగా నియోజకవర్గం పురోగతి కుంటుపడిందంటూ అంశాలవారీగా ప్రజల ముందుంచుతున్నారు. పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ రంగాల బలోపేతం వంటివి నేటికీ జాడ లేకపోవడాన్ని జయలక్ష్మి ఎత్తిచూపుతున్నారు. నియోజకవర్గం హక్కైన సింగూరు నీళ్లు దరిచేర్చి సాగు, తాగు నీటిని అందించడంలో ఉమ్మడి పాలకుల మాదిరే తెలంగాణ రాష్ట్రంలోనూ టీఆర్‌ఎస్ సర్కారు కూడా విస్మరించిందని ప్రస్తావిస్తున్నారు.
వెనుకబడిన నియోజకవర్గంలో ఎప్పుడో జరుగాల్సిన అభివృద్ధి దారుణంగా కుంటుపడిందని వివరిస్తున్నారు. ఈ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం ఇన్నాండ్లుగా నిర్లక్ష్యానికి గురైన తీరుపై జనాన్ని ఆలోచింపజేస్తున్నారు. వాళ్లలో చైతన్యానికి, సంఘటితానికి నడుం కట్టారు. తమకో పోరాటపటిమ సొంతమైన నాయకురాలి అండ దొరికిందన్న జోష్ నింపుతున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి తమదైన ప్రచార శైలితో ఇండ్లూ, వాడలను ఏకం చేస్తున్నారు. బీఎల్‌పీని ఆదరించి, తనను అసెంబ్లీకి పంపిస్తే అందోల్ సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల జీవితాల్లో వెలుగు నింపే విధానాల కోసం శక్తి మేర కృషి చేస్తానని హామీనిస్తున్నారు. ఆచరణ సాధ్యమయ్యేలా అగ్రకులాల్లోని గరీబులు సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలందరికీ ఉపయుక్తమయ్యే అర్థవంతమైన బీఎల్‌పీ మ్యానిఫెస్టో విశేషాలను ఎక్కడికక్కడ ప్రజలకు అర్థమయ్యే తరహాలో చెబుతూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు ప్రత్యామ్నాయంగా..
ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రస్తుత సంగారెడ్డి జిల్లాలోని అందోల్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఓ ప్రత్యేకత ఉన్నది. కడపటి ఎన్నికల ముందు అవిభాజ్య రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా చేసిన దామోదర రాజనర్సింహ ఆ సెగ్మెంట్ నుంచే శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా అందోల్ నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడి తాజా మాజీ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్‌కు 'కారు' టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్ నుంచి క్రాంతికిరణ్ పోటీ చేస్తున్నారు. ఈ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీఎల్‌పీ బరిలో నిలిచింది. అందునా ఒక సీనియర్ మహిళా నాయకురాలిని పోటీలో నిలిపింది. అంగన్‌వాడీ పోస్టుకు రాజీనామా చేసిన జయలక్ష్మి అందోల్ అభ్యున్నతికి అంకితభావంతో సేవలు అందించేందుకు ముందుకొచ్చారు. అంగన్‌వాడీలూ, ఆశాల వంటి కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే ఓర్పూ నేర్పూ ఉన్న మహిళగా గుర్తింపు ఉంది.
-ఇల్లెందుల దుర్గాప్రసాద్త్
Fri 16 Nov 22:27:37.09856 2018